గోధుమలు FCI గోదాముల్లోకి..

దేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాలలో గోధుమల సేకరణ చాలా వేగంగా సాగుతోంది. సెంట్రల్ పూల్ విధానంలో భాగంగా ఈ నెల 26వ తేదీ నాటికి 88.61 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎమ్‌టీ) గోధుమల సేక‌ర‌ణ జ‌రిగింది. ఇందులో 48.27 ఎల్‌ఎమ్‌టీల గోధు‌మలు పంజాబ్ రాష్ట్రం నుంచి, 19.07 ఎల్‌ఎమ్‌టీల గోధుమ‌లు హర్యానా రాష్ట్రం నుంచి సేక‌రించ‌డం జ‌రిగింది. ఈ ఏడాది గోధుమ‌ల సేక‌ర‌ణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రెండు రాష్ర్టాల నుంచి ప్ర‌ధాన స‌హ‌కారం అందింది. ప్రస్తుత సేకరణ వేగంతో చూస్తే ఈ సీజన్‌కు ల‌క్ష్యంగా ఉంచిన 400 ఎల్‌ఎమ్‌టీ గోధుమ‌ల సేక‌ర‌ణ త్వ‌ర‌లోనే సాకారమ‌య్యే అవకాశం క‌నిపిస్తోంది.

రైతుల‌కు ఎలాంటి బాధ‌లు రాకుండా చ‌ర్య‌లు..

కోవిడ్‌-19 వైర‌స్ వ్యాప్తి ముప్పు పొంచి ఉన్న ఈ త‌రుణంలో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవ‌డంతో పాటు మండీలలో సామాజిక దూరం ఉండేలా చూసుకుంటూనే ధాన్యం సేకరణ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ముఖ్యంగా రైతులు ఎలాంటి బాధలకు గురికాకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆహార ధాన్యాలను మిగులు క‌లిగి ఉన్న ప్రాంతాల నుండి వాటిని వినియోగించే ప్రాంతాలకు పంపించేలా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) లాక్‌డౌన్ కాలంలో పంపిన ఆహార ధాన్యాలు రైలు లోడ్ల పరంగా 2000 సంఖ్యను దాటేసింది. సోమ‌వారం (27.04.20) వరకు భారత ప్రభుత్వ వివిధ పథకాల కింద ఆహార ధాన్యాల అవసరాలను తీర్చడానికి మొత్తం 58.44 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల‌తో 2087 రైలు లోడ్లు పంపించబడ్డాయి. ఇదే స‌మ‌యంలో 53.47 ఎల్‌ఎమ్‌టీ స‌రుకు మోస్తున్న 1909 రేక్‌లను అన్‌లోడ్ చేయడం కూడా జరిగింది.

ఆహార‌ధాన్యాల‌ను వినియోగించే వివిధ రాష్ట్రాల్లోని అనేక కీలక అన్‌లోడ్ కేంద్రాలలో హాట్‌స్పాట్‌లు, కంట‌యిన్‌మెంట్ జోనులుగా ‌ప్రకటించడం వలన తీవ్ర అవరోధాలు ఎదుర‌యిన‌ప్ప‌టికీ.. ఈ స్థాయిలో ఆహార ధాన్యాల అన్‌లోడ్ జ‌ర‌గ‌డం విశేషం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమంగా ఆంక్షలను సడలిస్తుండ‌డంతో రాబోయే రోజుల్లో అన్‌లోడ్ వేగం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

పీఎంజీకేఏకు ప్ర‌త్యేక ఏర్పాటు..

ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేఏ) కింద వ్య‌క్తి ఒక్క‌రికి ఐదు కిలోల మేర ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు వీలుగా ఎఫ్‌సీఐ ధాన్యాల స‌ర‌ఫ‌రా కార్య‌క‌లాపాలు మెరుగ్గా ముందుకు సాగుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలైన లడాఖ్ మరియు లక్షద్వీప్‌ల‌కు మొత్తం మూడు నెల‌లకు అవ‌స‌ర‌మైన పూర్తి కోటాను చేర‌వేత ఇప్ప‌టికే పూర్త‌యింది. కాగా మరో 7 రాష్ట్రాలు జూన్ నెల కోటాను, దాదాపు 20 రాష్ట్రాలు ప్రస్తుతం మే నెల కోటాను తీసుకుంటున్నాయి. 8 రాష్ట్రాలు ఏప్రిల్ నెల కోటాను తీసుకుంటున్నారు. ఇది నెలాఖరులోగా పూర్తవుతుందని భావిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఆహార ధాన్యాల అవసరాలను తీర్చడానికి గాను ఎఫ్‌సీఐ తగినన్ని నిల్వ‌ల‌ను ఉంచేలా త‌గిన‌ ఏర్పాట్లు చేసింది. పశ్చిమ బెంగాల్ విషయంలో 3 నెలల అదనపు కేటాయింపుల‌కు గాను సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అవ‌స‌రం. తక్కువ వ్యవధిలో తగినంత ఆహార ధాన్యాలు లభించేలా చూడటానికి వీలుగా 4 రాష్ట్రాల నుండి ఏకకాలంలో 227 రైలు లోడ్ బియ్యాన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించడానికి ఇప్పటికే ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసి పెట్టింది. ప్ర‌ధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గ‌ఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి వీటిని త‌ర‌లించేలా ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించారు.