పాస్‌పోర్టు లేదు కానీ విదేశాల్లో ఆస్తులు.. వికాస్ దూబే కేసులో ట్విస్ట్

ఇటీవల 8 మంది పోలీసులను చంపిన కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కేసులో రోజుకో ఆసక్తికర విషయాలు వెల్లడి అవుతున్నాయి. అతని ఎన్‌కౌంటర్ తర్వాత విచారణ చేస్తున్న పోలీసులు వీటిని చూసి ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఆయన ఆస్తులపై ఆరా తీయగా.. విదేశాల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని తేలింది. అయితే ఇన్ని ఆస్తులు ఉన్నా వికాస్ దూబేకు సొంతంగా పాస్ పోర్టు కూడా లేదు.

లక్నో ప్రాంతీయ పాస్ పోర్టు కేంద్రంలో ఆయనకు సంబంధించిన వివరాలను పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.దూబేకు దుబాయ్, థాయ్ లాండ్, బ్యాంకాక్ దేశాల్లో ఆస్తులున్నాయి. విలువైన హోటళ్లలో పెట్టుబడులు కూడా పెట్టాడు. కానీ అతనికి పాస్ పోర్టు లేకపోవడం ఆసక్తిగా మారింది. అయితే స్థానికంగా ఉండే జై బాజ్ పాయ్ అనే వ్యాపారి ద్వారా నల్లధనాన్ని విదేశాలకు తరలించాడని పోలీసుల నిర్ధారించారు. కాగా వికాస్ దూబే కొడుకు మాత్రం విదేశాల్లో వైద్యవిద్య చదివాడు. దూబే పేరిట పాస్ పోర్టు లేకపోవడంతో అతడు మరేదైనా ఫేక్ పాస్ పోర్టు పొంది ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా దూబే పేరిట భారత్‌లోనూ కోట్లాది ఆస్తులు ఉన్నాయి.