దేశమంతటా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించుకున్నాం, గల్లీల్లో కూడా కంచెలు వేసుకుంటున్నాం, బయటకు వెళ్లేది లేదని భీష్మించాము, ఇంటి ముందు లక్ష్మణ రేఖను గీసుకున్నాం, అంతా బాగానే ఉన్నా మన ఇంద్రియాలే వైరస్ ప్రవేశంకు సత్వరమార్గాలనే విషయాన్ని మరచిపోవద్దు.
మన తక్షణ కర్తవ్యం కళ్లు, ముక్కు, నోటిని వైరస్‌కు దూరంగా పెట్టడం. డిసెంబర్ 2019లో ఉనికి చాటుకున్న కరోనా వైరస్ ప్రపంచంలోని 200 రకాల వైరస్లలో ఓ రకం మాత్రమే.
ఈ వైరస్ సంక్రమించగానే జలుబు, దగ్గు, సరిగా శ్వాస ఆడకపోవడం, జ్వరం లక్షణాలు ఉంటాయని తెలుసుకున్నాం. అలాగే ఎవరైనా తుమ్మినా, దగ్గినా ముక్కు, నోటి నుంచి వచ్చే తుంపర్లలో కరోనా వైరస్ మూడు గంటలు బతికి ఉంటుందని కూడా తెలుసుకున్నాం. అలాగే ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్, బెంచీలపై, గ్లాసులపై ఈ వైరస్ మూడు రోజులు బతికి ఉంటుందని పరిశోధనలతో అర్థమైంది.
అంతేకాదు కార్డ్ బోర్డ్, పేపర్, ఫాబ్రిక్, హెస్సియన్ వంటి వాటిపై ఈ కరోనా 24 గంటలు బతికి ఉంటుందని కూడా అర్థమైంది. ఇవన్నీ చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ వస్తువులపై ఉన్న వైరస్ మనకు సోకకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చాలా స్పష్టంగా చెప్పింది.
కరోనా వైరస్ మన ముక్కు, నోరు, కళ్ళు ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మన శరీరంలోకి పంచేంద్రియాల నుంచి వైరస్ చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటే మనం కరోనా కట్టడి యుద్ధంలో గెలిచినట్టే. మనం ఏమి చేయాలంటే ప్రతి రెండు గంటలకు ఒక సారి చేతులను సబ్బు నీటితో లేదా శానిటైజర్, డేటాల్ తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత మనం వస్తువుల్ని ముట్టుకున్నా ఎలాంటి వైరస్ సంక్రమించదు. మనం జాగ్రత్తలు ఈ జాగ్రత్తలు తీసుకున్నంత వరకు కరోనా వైరస్ మన దరిచేరదు. అందరూ శ్రద్ధగా పాటించాలని విజ్ఞప్తి.