యోగా, నేచురోపతిని నియంత్రించాలి
ఇటీవల కాలంలో బహుళ ప్రాచుర్యం పొందిన యోగా, నేచురోపతి వంటి వైద్య విధానాలను సైతం భారతీయ వైద్య విధాన కమిషన్ నియంత్రణ కిందకు తీసుకురావాలని వైఎస్సార్సీ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు. భారతీయ వైద్య విధాన జాతీయ కమిషన్ బిల్లు, జాతీయ హోమియోపతి కమిషన్ బిల్లులపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. భారతీయ వైద్య విధానాలైన ఆయుర్వేద, యునాని, సిద్ధ, సోవా రిగ్పాను నియంత్రిస్తూ ఆయా రంగాలలో పారదర్శకత, బాధ్యతను కల్పించేందుకు ఈ బిల్లులో ప్రతిపాదించిన సంస్కరణల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల కాలంలో బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన యోగా, నేచురోపతి వంటి వైద్య విధానాలను కమిషన్ నియంత్రణ పరిధిలోకి తీసుకురాకపోవడం శోచనీయమని అన్నారు. భారతీయ వైద్య విధానాలలో విద్య, వృత్తిని నియంత్రణ కోసం యోగా, నేచురోపతిని కూడా తప్పనిసరిగా కమిషన్ పరిధిలోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఆరోగ్యస కుటుంబ సంక్షేమానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమర్పించిన 115వ నివేదికలో సైతం ఈ విషయాన్ని విస్పష్టంగా చెప్పిందని అన్నారు. యోగా, నేచురోపతిని నియంత్రించకుండా వదిలివేయడం వలన ఆయా విధానాలలో వృత్తి విద్యలో ప్రమాణాలు సాధించడం సాధ్యం కాదు. ఫలితంగా అక్రిడిషన్ ప్రక్రియ లోపభూయిష్టంగా మారుతుంది. ఫలితంగా భారతీయ వైద్య విధానాలలో ఏకరూప ప్రమాణాల స్థాపనకు అవరోధంగా మారుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. అలాగే బిల్లులోని సెక్షన్ 33లో పొందుపరచిన ఒక నిబంధనను తొలగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఈ నిబంధన కారణంగా భారతీయ వైద్య విధానాలు ప్రాక్టీసు చేసే అర్హులైన వైద్యులకు అన్యాయం జరుగుతుంది. ఈ నిబంధన కారణంగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఉత్తీర్ణులు కాని కొందరు కమిషన్ అనుమతితో ప్రాక్టీసు చేసుకునేందుకు అర్హత సాధిస్తారు. ఫలితంగా నకిలీ వైద్యుల బెడదను అరికట్టేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు లక్ష్యం నిర్వీర్యమవుతుందని ఆయన అన్నారు.
ఓబీసీల సబ్- కేటగిరీపై కమిషన్ గడువు పెంపు
న్యూఢిల్లీ, మార్చి 18: దేశవ్యాప్తంగా వెనుకబడిన కులాల సబ్-కేటగిరిగా విభజించాలన్న ప్రతిపాదనలపై అధ్యయనం చేయడానికి నియమించిన కమిషన్ గడువును ఈ ఏడాది జూలై 31 వరకు పొడిగించినట్లు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి శ్రీ కృష్ణపాల్ గుర్జర్ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. రిజర్వేషన్ ఫలాలు ఓబీసీలకు సమాన నిష్పత్తిలో అందడం లేదన్న ఫిర్యాదులపై ఎలాంటి కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించలేదని మంత్రి తెలిపారు. అయితే ఓబీసలను సబ్-కేటగిరీల కింద విభజించాలంటూ వచ్చిన డిమాండ్లపై అధ్యయనం చేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 కింద కల్పించిన అధికారాన్ని వినియోగించి 2017 అక్టోబర్ 2న కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ను నియంమించింది. ఈ కమిషన్ గడువును పలుధపాలుగా పొడిగిస్తూ రావడం జరిగింది. తాజాగా కమిషన్ గడువును ఈ ఏడాది జూలై 31కి పొడిగిస్తూ గత జనవరి 17న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినట్లు మంత్రి వివరించారు.