చేతులు కలిపి షేక్ హ్యాండ్ ఇవ్వడం.. ఆలింగనాలు చేసుకోవడం ప్రపంచంలో పాశ్చాత్య దేశపు అలవాట్లు.
భరత ఖండంలో రెండు చేతులు జోడించి నమస్కారించడం మన భారతీయుల సంస్కారానికి నిదర్శనం. కరోనా వైరస్ విలయ తాండవం ప్రపంచ దేశాల్లో షేక్ హ్యాండ్ సిస్టంకు తిలోదకాలిచ్చింది. మన సనాతన ధర్మం నమస్కార సంస్కారాన్ని ఏడు ఖండాల్లో మానవాలంతా స్వీకరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. మన సంస్కృతికి, సంప్రదాయాలను విచిత్రంగా చూసే విదేశీయులు ప్రస్తుతం ముక్కున
వేలుసుకుని అక్కున చేర్చుకునే పనిలో పడ్డారు.
అందుకే కరోనా వైరస్ దరిచేరకుండా ఉండేందుకు ప్రపంచ దేశాలు యోగా సాధనపై దృష్టిని సారించాయి. మనదేశంతో పాటు వివిధ దేశాల్లో యోగా సాధన జోరందుకుంది. అగ్రరాజ్యం అమెరికా ఆన్ లైన్లో నిర్వహిస్తున్న యోగా శిక్షణ తరగతులకు విశేష స్పందన లభిస్తోంది. కానీ యోగ పుట్టినిల్లు మాత్రం ఇండియా. మనది యోగ భూమి.. యోగ సాధనకు మన ప్రాచీన మునులు, ఋషులు, గురువులు మనకు వారసత్వంగా యోగ-శాస్త్రాన్ని అందజేశారు. నటి నుంచి నేటి వరకు యావత్ ప్రపంచంలో కోట్లాది మంది సాధన చేసి శారీరకంగా, మానసికంగా ప్రయోజనంతో పాటు ఆర్ధికంగా ఉపాధి పొందుతుండడం మనకు గర్వకారణం.
భారత దేశంలో యోగా శాస్త్రం అతి ప్రాచీనమైనది. కొన్ని వేల సంవత్సరాల కిందటే మనదేశంలో యోగా సాధన అంకురార్పణ చేసుకుంది. సింధూ-సరస్వతి నాగరికత తవ్వకాల ద్వారా లభించిన ఆధారాలు, అవశేషాలలో యోగ ముద్రలు వెలుగు చూశాయి. వేద కాలాలు, ఉపనిషత్తులు, బౌద్ధ-జైన గ్రంథాలు, చారిత్రక ఇతిహాసాలైన రామాయణ-మహాభారతంలతో పాటు శైవ-వైష్ణవ-తంత్ర సంప్రదాయాలన్నిటిలోనూ, యోగ సాధన ప్రస్తావన కనిపిస్తుండడం మనదేశ యోగాశాస్త్ర నేపథ్యాన్ని తెలియజేస్తుంది. సూర్యుడిని వేదకాలంలో ముఖ్యమైన దేవుడిగా కొలిచేవారు. వేదకాలంలో ఆ తరువాత కాలంలో `సూర్య నమస్కారాలు’ ఆవిష్కృతమైంది.
యోగాలో శ్వాస ప్రక్రియలకు సంబంధించిన ప్రాణాయామం రోజువారీ పూజా విధానంలో భాగoగా ఉండేదని ఇతిహాసాల్లో పేర్కొని ఉంది. అయితే అనాదిగా మనదేశంలో యోగ సాధన ఉన్పప్పటికీ.. యోగ క్రియలు, వాటి తాత్పర్యాలను ఒక క్రమపద్ధతిలో క్రోడీకరించి పతంజలి మహిర్షి యోగ సూత్రాలు రూపొందించారు. అందుకే పతంజలిని యోగా శాస్త్ర పితామహులుగా కీర్తిస్తుంటారు. అయితే ఆధునిక కాలంలో బి.కె.ఎస్. అయ్యంగార్ కృషి వల్ల యోగా శాస్త్రం పట్ల ప్రజలు చర్చించుకోవడం మొదలయ్యింది. యోగాపై అనేక పరిశోధనలు చేసిన అయ్యంగార్ వాటిని పుస్తకాల రూపంలోకూడా తీసుకువచ్చారు. యోగా సాధనలో సరి కొత్త విధానాలను ఆవిష్కరించారు బికేఎస్ అయ్యంగార్. నేడు ప్రపంచవ్యాప్తంగా అయ్యంగార్ యోగా ప్రాచుర్యంలో ఉండగా విశ్వవ్యాప్తంగా ఎన్నేళ్ల నుంచో అడుగులు పడగా PM నరేంద్ర మోదీ విస్తృత పరిచారు.
PM మోదీ అందరికి ఆరోగ్యం లక్ష్యంగా యోగా శాస్త్ర పాకస్త్యాన్ని 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో తెలియచేశారు. ఆ నేపథ్యంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సం నిర్వహణకు ఐక్యరాజ్యసమితి చేసిన ప్రతిపాదనను 177 మంది సభ్యులు ఆమోదించారు.
దీంతో 2015 నుంచి ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
యోగా చేయడంతో ప్రయోజనాలు అనేకం. శరీరం, మనస్సు, అంతర్శక్తిని ఏకీకృతం చేస్తుంది యోగా. నిత్య జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవడం ద్వారా దీర్ఘకాలికంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. శరీరంలోని ప్రతి జబ్బుకు యోగా పరిష్కారాన్ని చూపుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. యోగా సాధన ద్వారా రోగనిరోధక శక్తిని పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ మియామీ పరిశోధకుల పరిశీలనలో వెల్లడి అయ్యింది. యోగా సాధన ద్వారా షుగర్, రక్తపోటు, వెన్నునొప్పి, ఆర్థరైటిస్ వంటి సమస్యలతోపాటు క్యాన్సర్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవచ్చని పరిశోధకులు తెలుపుతున్నారు.
కరోనా వైరస్ రక్కసి నివారణకు యోగా..
కరోనా వైరస్ రక్కసి నివారణకు మన దేశ ప్రాచీన యోగాభ్యాసం ఇప్పడు ప్రపంచ దేశాలకు ఉపయోగ పడుతోంది. ప్రధానంగా అగ్రరాజ్యం అమెరికా చూపు యోగాపై పడింది. లాక్ డౌన్ లో ఉన్న దేశాల్లో యోగా సాధనలో బిజీ అయ్యారు ప్రజలు. మానసిక, శారీరక పరిరక్షణకు యోగా సాధన చేస్తున్నారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో గత నెల 30 నుంచి ప్రారంభమైన ఆన్లైన్ యోగా సాధన తరగతులకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. లక్షలాది మంది ఆన్లైన్లో యోగా శిక్షణ ద్వారా సాధన చేసుకుంటున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి అవసరమయ్యే యోగా ఆసనాలను , ప్రాణామాయం చేస్తుండడం స్ఫూర్తి దాయకం.
త్రివేణి శ్యామ్
(డిప్లోమా ఇన్ యోగా, భారతీయ విద్యాభవన్, న్యూఢిల్లీ)