తిరుపతి సభను రద్దు చేసుకున్న వైఎస్ జగన్ 

తిరుపతి సభను రద్దు చేసుకున్న వైఎస్ జగన్ 

ఏపీ సీఎం జగన్ ఈ నెల 14న తిరుపతిలో భారీ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉండగా, అనూహ్యరీతిలో ఆ కార్యక్రమం రద్దయింది. ఏపీలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో తాను తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నట్టు ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. దీనిపై తిరుపతి పార్లమెంటు స్థానం ఓటర్లకు లేఖ రాశారు. ఇంతకుముందే ఆయన వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లందరికీ లేఖ పంపారు.అయితే తాను తిరుపతి పర్యటనకు రాబోవడంలేదని తాజాగా మరో లేఖలో ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏపీలో గడచిన 24 గంటల్లో 11 మంది మరణించారని, అందులో నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాసులేనని వివరించారు. ఈ రెండు జిల్లాల పరిధిలో ఉన్న తిరుపతి పార్లమెంటు స్థానంలో నేను వ్యక్తిగతంగా బహిరంగ సభకు వస్తే అభిమానం, ఆప్యాయతతో వేలమంది తరలి వస్తారని, కానీ కరోనా నేపథ్యంలో ఓ బాధ్యతగల ముఖ్యమంత్రిగా సభకు హాజరు కాలేనని, అందుకే ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నానని సీఎం జగన్ తన లేఖలో వివరించారు.